ట్యాక్స్ తగ్గించేందుకు రూ.50 వేల లంచం.. ఏసీబీ వలలో DCTO, సీనియర్ అసిస్టెంట్

ట్యాక్స్ తగ్గించేందుకు రూ.50 వేల లంచం.. ఏసీబీ వలలో DCTO, సీనియర్ అసిస్టెంట్

నిర్మల్ జిల్లా వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు పంజా విసిరారు. వ్యాపారిని లంచం డిమాండ్ చేసిన ఇద్దరు అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే... నిర్మల్ జిల్లా కేంద్రంలోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ (DCTO) గా పనిచేస్తున్న గోదావరి, సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయి కృష్ణ... ఓ స్థానిక వ్యాపారి పన్నును తగ్గించేందుకు రూ. 50 వేలు లంచం డిమాండ్ చేశారు.లంచం ఇవ్వడం ఇష్టం లేని ఆ బాధితుడు వెంటనే ఏసీబీ అధికారులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో దాడులు నిర్వహించారు.

వ్యాపారి నుండి డిసిటిఓ గోదావరి, సీనియర్ అసిస్టెంట్ మంత్రి సాయి కృష్ణ రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారుల అక్రమ దందాలపై ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.